Wednesday, April 11, 2018

కాంచనమయ వేదికా

చిత్రం : నర్తనశాల (1963)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

రచయిత : తిక్కన 

నేపథ్య గానం : ఘంటసాల 


పద్యము : 



ఉత్తర కుమారుడికి కౌరవ సేనను పరిచయం చేస్తూ...




కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు
లలిత కంబుప్రభాకలిత పతాకా విహారంబువాఁడు రాధాత్మజుండు


మణిమయోరగ రుచిజాల మహితమైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము



"కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు "
బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు
‘కలశజుండు : (కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు


"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు " :
సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.


"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు " :
బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.


"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "
"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.


"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "
"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.


"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"
బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు
సురనదీసూనుడు.. సురనదీ : గంగ
సూనుడు : కొడుకు ... భీష్మాచార్యుడు.


ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు


కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.



తిక్కనగారు చేసిన చమత్కారం ఏమిటంటే... అందరికీ కేతనమనో, కేతువనో వాడక ఒకొక్కరికి ఒకో పదము వాడారు. కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ, సిడము.

2 comments:

  1. ఆహా అత్యద్భుతః...చాలా వివరంగా చెప్పారు :)

    ReplyDelete